BHAGAVATA KADHA-3    Chapters   

నివాతకవచుల జంపునపుడు కృష్ణ కృప

56

శ్లో|| తత్రైవ మే విహరతో భుజదండ యుగ్మమ్‌,

ఖాండీవ లక్షణ మరాతి వధాయ దేవాః |

సేంద్రాః శ్రితా యదను భావిత మాజమీఢ

తేనాహమద్య ముషితః పురుషేణ భూమ్నా ||

- భాగ. 1 స్కం. 15 ఆ. 13 శ్లో.

''కాలకేయ నివాత కవచాది దైత్యులఁ

జంపితి నెవ్వని సంస్మరించి...''

అట్టివాడు ''మనలను దిగనాడి చనియె మనుజాధీశా||''

ఛప్పయ

కఛుక కాల సుఖ సహిత స్వర్గ సుఖ భోగే భారీ |

దివ్య అస్త్ర సబ సీఖి చలన కీ కరీ తయారీ ||

దేవరాజ సబ దేవ కమేఁ ఇక కారజ కీజే |

అస్త్ర శస్త్ర తో లయే దక్షిణా గురు కీ దీజే ||

హైఁ నివాతకవచాది అతి, ప్రబల దైత్య తినతే లరో |

మారో రణ మేఁ సబని కూఁ, నిష్కంటక సురపుర కరో ||

అర్థము

అర్జునుఁడు ధర్మరాజుతో నిట్లనెను:- అన్నా! కొంత కాలము నేను స్వర్గములో నుండి అనేక స్వర్గసుఖముల ననుభవించితిని. అచ్చట దేవేంద్రాదులవలన సమస్త అస్త్రములను నేర్చుకొని, వాటి సంహారోపసంహారములను అభ్యసించితిని. అంత దేవేంద్రుఁడును, దేవతలును ఇట్లనిరి :- " అర్జునా ! నీవు మావద్ద నస్త్రశస్త్రములను నేర్చుకొంటివి. కావున గురుదక్షిణ నీయవలయును. ఆ దక్షిణ ఏమనఁగా నివాత కవచాదులను అతి ప్రబల దైత్యులు కలరు. వారి నందఱను యుద్ధములోం జంపి సురపురిని నిష్కంట మొనర్పుము."

-----

'దేవ దానవ యక్షరాక్షసులుకూడ నన్ను గెలువఁజాలని ఆ రోజులేవి ? అవి పోయినవి. ఇప్పుడో సాధారణభిల్లులు నన్ను ఁ గొట్టి వెడలఁగొట్టిరి.' అనుచు నర్జునుఁ డేడ్చుచు ధర్మరాజు అడుగకపూర్వమే యిట్లని చెప్పఁదొడఁగెను:- " రాజా ! ఇప్పుడు చెప్పవలసినదియును లేదు. వినవలసినదియు లేదు. నాకు స్వర్గము లోని విషయములు జ్ఞాపకమునకు వచ్చుచుండిన, నాయాశ్చర్యమునకు మేఱయుండుట లేదు. అవి చిరకాలముక్రిందట వచ్చిన స్వప్నములవలెను, పూర్వజన్మములో జరిగిన విషయములవలెను దోఁచుచున్నవి. నే నైదుసంవత్సరములు స్వర్గములో నుంటిని. నేనచ్చట శ్రీకృష్ణకృపచే దేవతలుకూడ చేయఁజాలనని కార్యము లొనర్చితిని.

నేనచ్చట సమస్త విధముల దివ్యాస్త్ర ఆదాన, సంధాన, విసర్గ సంహారములను నేర్చుకొని, వాటిని బ్రయోగించుటలో నిపుణుఁడనై న తర్వాత, నేను మీ చరణ సన్నిధికి వచ్చుటకు ఇంద్రుని అనుజ్ఞ నడిగితిని. భరత వంశావతంసా ! ధర్మరాజా ! నేను స్వర్గములో నివసించుచున్నప్పటికిని, స్వర్గీయదివ్యభోగముల ననుభవించుచున్నప్పటికిని నామనస్సున శాంతిలేదు. నాకు ఉండి ఉండి జూదము విషయముల లన్నియు జ్ఞాపకమునకు వచ్చుచుండెడివి. నిండు సభలో ద్రౌపదిని అవమానమును జేసిన సంగతి తలఁచుకొనిన క్రోధముచే నా శరీరము కంపించెడిది. వెంటనే ఒక్కఁడనే బయలుదేరివచ్చి, యా దివ్యాస్త్రములచేఁ గౌరవుల నందఱను భస్మము చేయవలయునని యుండెడిది. కాని వెంటనే మీ ప్రతిజ్ఞ నాకు జ్ఞాపకమునకు వచ్చెడిది. మీరు ధర్మాత్ములరు. ధర్మవిరుద్ధముగ మీరేపనియును జేయరు. వనవాసము గడువు పూర్తికానిది మీ రేవిధమునను దిగిపోరు. ఒకవేళ నేను తొందరపడి కౌరవులను జంపియుండిన, మీరు నిశ్చయముగ నే నధర్మిననియు, మోసకాఁడననియు భావించి నన్ను బరిత్యజించెడు వారే. ఈ భయముచే నేను నా క్రోధమును దిగమ్రింగి, మనస్సు కుదుట పరచుకొని సమయము కొఱకు ప్రతీక్షించుచుంటిని. మీరు లేక స్వర్గములో నాకు సుఖముకనఁబడలేదు. మీ రరణ్యములలో నానా యిడుములు పడుచు, నేను స్వర్గభోగము లనుభవించుచుండిన నా భోగము లనుభవించియేల? అనుభవించకేల ? ఇట్టి స్థితిలో ఇంద్రలోకమే కాదు బ్రహ్మలోకమే నాకు సుఖప్రదముగ నుండఁజాలదు. కాని, కార్యవశమున, మీ యాజ్ఞను బరిపాలించుటకు నే నచ్చట ఉండవలసివచ్చినది. దేవేంద్రుని బలవంతముచే స్వర్గసుఖములను గూడ సరిగా ననుభవింపలేదు.

నేను అస్త్రశస్త్రములలో బాగుగాఁ బారగంతుఁడను కాఁగానే ఒకదినమున దేవేంద్రుఁడు నన్నత్యంతమమకారముతో దగ్గఱకు పిలిచి యిట్లనెను :- " వత్సా ! అర్జునా ! నీవు త్రైలోక్య విజయుఁడవైతివని నాకు నమ్మకము కలిగినది. ఇప్పుడు మూఁడు లోకములలో జయింపఁగలవాఁడు లేఁడు. నీవు శ్రద్ధగా సమస్త శస్త్రాస్త్రములను నేర్చుకొంటివి. నీధారణఆశక్తికిని, హస్తలాఘవ శక్తికిని నేను మిక్కిలి సంతోషము చెందితిని. నీవు నా కార్యమొకటి నెఱవేర్చవలసి యున్నది. నేరుచకొనినవిద్యకు గురుదక్షిణ నిచ్చుట కిదియే సమయము".

నేనుచేతులు జోడించి యిట్లంటిని :- " ప్రభూ! మీరిచ్చిన ఆజ్ఞ నా శక్తికి మించినది కాకున్నయెడల నది నెఱవేరిన దనియే నమ్ముఁడు. మీకే ప్రియకార్య మొనర్పవలయునో నా కాజ్ఞాపింపుఁడు."

దేవేంద్రుఁ డానందముతో నిట్లనెను :- " అర్జునా ! ఇప్పుడు మేమందఱమును నీబాహుబలమును ఆధారముగఁ జూచుకొన్నాము. మేము, దేవతలందఱమును గలిసి చేయలేని పనిని నీవు చేయవలసియున్నది. నాకు నివాతకవచులను దైత్యులు శత్రువులై యున్నారు. వారు సముద్రమధ్యమునఁ బాతాళమున నుందురు. వారు షుమారు మూఁడు కోట్లమంది కలరు.వారు దేవ, దానవ, గంధర్వ, యక్షాదులచేఁజావరు. కావున నీవు వారిని జంపి, దేవతలకు మేలొనర్పుము."

దేవేంద్రుని నోట యిట్టి ప్రశంసను వినఁగానే నాకు కొంత గర్వ మతిశయించెను. నే నిట్లనుకొంటిని :- " దేవేంద్రుఁడు నా బాహుబలముపై, నా గాండీవధనుస్సుపై, నా యస్త్రవిద్యపై నింతటి విశ్వాసమునంచినాఁడు. నాలో అంతటి బలమెక్కడిది ? దేవతలచే నవధ్యులైనవారు నాచేతఁ జత్తురా ? ఆ సమయమున నేను, ఈ బలము నాదికాదు, శ్యామసుందరునదను సంగతి మఱిచియేపోయితి. నివాతకవచులను, హిరణ్యపురవవాసులగు దైత్యులను జంప నాలోనిజముగ శక్తిలేదు. కాని ఆ సర్వాధారుఁడిచ్చిన శక్తితోఁ జావఁగలరు." నేను దేవేంద్రుని యాజ్ఞను బొంది, మాతలి నడుపు ఆ దివ్యరథముమీఁద దైత్యులను జంపుటకు స్వర్గమునుండి బయలుదేరితిని. ఆ సమయమున స్వర్గవాసుల ఆనందమునకు మేఱలేదు. దేవతలు, ఋషిగణము నా పరాక్రమమునుగూర్చి ప్రశంసించిరి. గంధర్వులు నా గుణగానము చేయుచుండిరి. అప్సరసలు నందనవనములోని దివ్యపుష్పములటచే నామీఁద వర్షమును గుఱిపించిరి. అందఱకు యథోచిత సత్కారములను గావించి దేవేంద్రుని దివ్యవరథముపై గూర్చిండి అనేక జలజంతువులతో నిండిన సముద్రతీరమునకు వచ్చితిమి. సారథి యగు మాతలికి రథము నడుపుటలో నెంతటి కుశలత్వముకలదో నాకప్పుడు తెలిసినది. నిమిషములో సహస్రాకములగు పచ్చని గుఱ్ఱములచే లాగఁబడుచున్న నారథము అనేకవంకరలుగఁ ద్రిప్పి భూమి క్రింద నున్న నివాతకవచుల దివ్యపురికిఁ గొనిపోయెను. అక్కడగల సుఖసామగ్రులు, వైభవము స్వర్గమునకు మించి యుండెను. స్వర్గవైభవములు వాటి ముందు బేలువోయినవి. ఆ పురము పూర్వము దేవతలదని నాకు మతలివలనఁ దెలిసినది. పూర్వము దేవత లచ్చట నివసించెడువారఁట. పరాక్రమ వంతులగు దైత్యులు దానిని లాగుకొనిరఁట. ఈ దైత్యులు గొప్ప బలవంతులు. బ్రహ్మదేవుని వరముచే వీరు దేవతల చేతను, ఇతర జీవులచే నవధ్యులైరి.

నన్నుఁజూడగానే దైత్యులు క్రోధ్రోద్రేకమున శూలపట్టిశ, ఖడ్గ, తోమర, భునుండి మొదలగు నానాయుధములను గొని నాపైకి విరుచుకొనిపడిరి. నేనుగూడ వారిపై సహస్రబాణములను విడిచి గాయపరచితిని. చాలమంది నాబాణములకు చచ్చిరి. చాలమంది వారిప్రాణములను గుప్పిటపెట్టుకొని పారిపోయిరి. కాని కొంతసేపైన తర్వాత మరల వారు అస్త్రశస్త్రములను గైకొని నాతోఁబోరాడ వచ్చిరి. ఈసారి వారు ఆసురీ మాయను బ్రయోగించిరి. ఒక్కొక్కప్పుడు మాయచే భయంకరవృష్టిని గుఱిపించిరి. ఒక్కొక్కప్పుడు రాళ్ల వాన గుఱియించిరి. ఒక్కొక్కప్పుడు ఎటుచూచినను అగ్నియే కనఁబడుచుండెను. ఒక్కొక్కప్పుడు ఘోరాంధకారము క్రమ్మెడిది. మాకేమియుఁ గనఁబడెడికాదు. ఆసమయమున వారు అలక్షిత భావముతో వివిధాస్త్రములను వర్షించిరి. ఆఘోరాంధకార ములో నామాతలికికూడ రథమునడుపుట కష్టమై తికమకపడెను. ఆతఁడిట్లనెను :- " అర్జునా ! దైత్యులు ప్రబలులు. ఇంతటి ఘోరయుద్ధము నే నెన్నడును జూడలేదు. నీవు వజ్రాస్త్రముచే నీమాయను గొట్టుము."

మాతలి భయభీతుఁడగుటను గాంచఁగానే నాహృదయముకూడ కంపించెను. నాకేమియుఁ గనఁబడుటలేదు. నాయస్త్రగతి ఆగిపోయెను. అప్పుడు నేను శ్యామసుందరుని స్మరించితిని. ఆ లీలామానుష స్వరూపిని నేను లోలోన స్తుతించితిని. స్మరింపఁ గానే ఆతడు నాకు బుద్ధియోగమును బ్రసాదించెను. నేను వజ్రాస్త్రమును బ్రయోగించి రాక్షసమాయను నాశనము చేసితిని. ఇప్పుడంధకారములేదు. ఎటుచూచినను దివ్యప్రకాశ##మే. మాతలియు జాగ్రత్తగ నుండెను. ఆతఁడు గుఱ్ఱపు కళ్లెములను లాగిప్టటుకొనెను. అంత నేను శబ్దభేది బాణములను విడిచి దాఁగిన దైత్యులను గొట్టితిని. నాదివ్యాస్త్రముల దెబ్బచేఁ జచ్చి దైత్యులందఱును నిర్జీవులై క్రిందపడిరి. వారినగలములో నెచ్చట చూచినను హాహాకారములువ్యాపించెను. మాతలి నా బలపరాక్రమములను బ్రశంసించెను. నేనింద్రునికంటె సూరుఁడననియు బరాక్రముఁడననియుఁ బలికెను. ఈ శక్తి నాదికాదనుసంగతి ఆతని కేమి తెలియును ? శ్యామసుందరుఁడే కాలపాశమునఁజిక్కి చచ్చిన దైత్యులను నన్ను నిమిత్తమాత్రునిఁగఁజేసి చంపించెను. ఆతని శక్తిచేతనే నేను అస్త్రశస్త్రములను సవిధిగఁ బ్రయోగించు చుంటిని. అది నిజముగ నాబలమే యగునెడల నేను ఆటవిక భిల్లులచే నేలయోడిపోవుదును ? నివాతకవచులను హిరణ్యపుర వాసులగు దైత్యులను జంపిన బాణము లిప్పుడు సాధారమ మానవులకడ నేల కుంఠితము లగుచున్నవి?

రాజా ! ఈవిధముగ సమస్త నివాతకవచాది రాక్షసులను జంపి, విజయశంఖమునుమ్రోగించి నే నత్యంతహర్షముతో ఆ పాతాళపురినుండి బయటకువచ్చితిని. మార్గమధ్యములో నాకాశమధ్యమునఁ గ్రిందకు వ్రేలాడుచున్న నొక దివ్యపురము నొకదానిని గాంచితిని. అది ఆకాశఁముననే వ్రేలాడుటనుగాంటి నేనాశ్చర్యము చెంది మాతలితో నిట్లంటిని :- " మహాభాగా ! నీవు దేవేంద్రునకు సారథివి. సర్వజ్ఞుఁడవు. ఈయాశ్చర్యకరమగు నగరమేదియో తెలుపుము. ఇది యింతదేదీప్యమానముగను, ఏమియు నాధారములేకుండఁగనున్నది యిది యెవరివరము వలననో చెప్పుము."

అంత మాతలి నాతో నిట్లనెను :- " పాండునందనా ! ఇది పౌలోమ, కాలకేయాది దైత్యులు నివసించు హిరణ్యపురము. ఈదైత్యుల తల్లులగు పులోమి, కాలికాయను వారు అనేక దివ్యవర్షములు ఘోర తపస్సును జేసిరి. ఆ తపస్సునకు మెచ్చి బ్రహ్మ వరములను గోరుకొనుమనెను. వారిట్లు వరముల నడిగిరి :- " మాపుత్రులను దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులెవరును జంపరాదు. వారు నివసించుట కొక సువర్ణ మయమగు పురమును సమస్త విమానములను మించుయుండు నట్లును, ఎచ్చటికి వెళ్లఁదలఁచిన నచ్చటకు వెళ్లకలిగి యుండు నట్లును, ఆకాశమున నాధారములేకయే వ్రేలాడుచుండఁగలిగి నట్లును నిర్మింపవలయును."

బ్రహ్మదేవుఁడు "తథాస్తు" అని అట్టి వరమునే యొసంగెను. పితామహుని వరముచేతనే యీనగర మిట్లు ఆకాశ మధ్యముననే వ్రేలాడుచున్నది. దీనిలో నివసించు దైత్యులతి బలవంతులు. వీరు దేవతలకు శత్రులు. ఎప్పుడునుదేవేంద్రునకు బాధ కలిగించుచుందురు. ఈ వరము వలన వీరు దేవతలచేఁ జావరు. అందువలన వీరిని దేవతలు చంపఁజాలకుండిరి. ఆ కారణమున వీరికి గర్వము హెచ్చి నిత్యనూతనోపద్రవము లొనర్చుచుందురు."

నేనిట్లంటిని :- " మాతలీ ! నారథము నీపురములోనికిఁ గొనిపొమ్ము. వీరు దేవేంద్రునకు శత్రువులైనప్పుడు నాకునుశత్రువులే. చేతులున్నవి, వీరినిగూడ చంపియే పోవుదము."

మాలిని యిట్లనెను :- " మహాభాగా ! నీవు వీరిని తప్పక చంపఁగలవు. వీరు దేవతలచేఁజావరనియు, ఒక మనుష్యుని చేతులలోఁజత్తురనియు బ్రహ్మనోట నేను వినియుంటిని. కావున నీవు వీరిని జంపి అవశ్యము దేవతల బాధను దొలిఁగించుము."

ఇది వినఁగానే వారిని జంపుటకు నేను నిశ్చయించు కొంటిని. ఆ పురములోఁ బ్రవేశింపఁగానే ఘోరయుద్ధము జరిగెను. దైత్యులందఱును నామీఁద నస్త్రశస్త్రములను గైకొని విరుచుకొని పడిరి. నేను కూడ నాదివ్యాస్త్రములచే వారి యస్త్రము లన్నిటినివ్యర్థము కావించి, నిమిషములో వారి నందఱను జంపివేసితిని. అంత వారందఱు నా దివ్యనగరములో దూరిరి.చ నేననేక తీక్షబాణములను సంధించి, ఆ సువర్ణ నగరమును ముక్కల ముక్కలు చేసి దైత్యుల నందఱను నేలమీఁదకుఁ బడగొట్టితిని. అప్పుడు వారు నారథ గుఱ్ఱముల కాళ్లను బట్టుకొనిరి. అంత వజ్రాస్త్రముచే వారినిగూడ పడఁగొట్టితిని.

ఈ విధముగ నా వాసుదేవుని కృపచే దేవతలకుఁగూడ దుర్జయులగు దైత్య దానవులను జంపి, విజయుఁడనై దేవేంద్రుని అమరావతికి వచ్చితిని. అక్కడ అందఱును నాకు మిక్కిలి వైభవముతో స్వాగతసత్కారములు కావించిరి.

ఎవని కృపచే నిదియంతయు జరిగెనో, ఎవని బలముచే నే నజేయులగు దైత్యులతో నిర్భయుఁడనై పోరాడఁగలిగితినో ఆ సర్వాంతర్యామియగు శ్యామసుందరుఁడు ఈ ధరాధామమును వదలిపోయెను. ఆతఁడు నన్ను మోసముచేసి వైకుంఠమునకుఁ బోయెను. రాజా ! ఇప్పుడు మనకాశ్రయము పోయినది. మనము హతవీర్యులమై, పరాక్రమ హీనులమైతిమి. ఇఁక మన జీవితము వ్యర్థము. ఇప్పుడు మనల నొక సామాన్య మానవుఁడు కూడ ఓడింపఁగలఁడు. నీచాతినీచులకంటె మనము నీచులము కాఁగలము." ఇట్లు పటుకుచు నర్జునుఁడు గద్గదికుఁడై, తర్వాత పలుకఁజాలక పోయెను.

ఛప్పయ

మారి సకే నహిఁ దేవ తిన్హీ ఁ తేఁమైఁ జా జూఝ్యో |

కృష్ణకృపా తేఁ కఛూ కఠిన కారజ నహీఁ సూఝ్యో ||

దివ్య అస్త్ర తేఁ మారి, శత్రు సబహీ సంహారే |

మాయా ఛల తేఁ లడే, తఉ రణ మేఁ సబహారే||

కాలికేయ పౌలోమ సబ, స్వర్ణపురీ వాసీ హనే

జనకే బల తేఁ బలీ బని, రాజన్‌ అబ తిను బిను బనే||

అర్థము

ధర్మజా ! ఎవరిని దేవతలుకూడ చంపఁజాలకపోయిరో వారిని నేను వెళ్లి చంపితిని. కృష్ణకృపచే నాకార్యము లేవియు కఠినములుగఁ దోఁచలేదు. దివ్యాస్త్రములను సంధించి శత్రువుల నందఱను సంహరించితిని. వారందఱును మాయా, మోసములతో యుద్ధముచేసిరి. అయినను వారినందఱను జంపితిని. హిరణ్యనగరవాసులగు కాలికేయ పౌలోమాది రాక్షసుల నందఱను జంపితిని. ఎవని బలమున బలవంతుఁడైన నే నిన్ని కార్యము లొనర్చితినో ఆతఁడిప్పుడు మనకు లేఁడు.

BHAGAVATA KADHA-3    Chapters